వాలంటీర్లు సేవలందించాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంగోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థుల సేవలు కీలక పాత్ర పోషిస్తాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. పుష్కరాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందిస్తూ గోదావరి జిల్లాల ఆతిథ్య సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వాలంటీర్లు సేవలందించాలని పిలుపునిచ్చారు.
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో సోమవారం రాజమహేంద్రవరంలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో గోదావరి పుష్కరాలు నిర్వహణపై నిర్వహించిన వర్క్‌షాప్‌కు కలెక్టర్ కీర్తి చేకూరి, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. ప్రసన్నముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన వేడుకలని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.పుష్కరాలకు రెండు రోజుల ముందు కాకుండా ఇప్పటి నుంచే ఆసక్తి, సేవాభావం కలిగిన విద్యార్థులను కళాశాలలు, ఎన్ఎస్ఎస్ విభాగాలు గుర్తించి వాలంటీర్లుగా సిద్ధం చేయాలని సూచించారు. వారికి భక్తులకు మార్గదర్శకత్వం, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసు శాఖతో సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం వంటి అంశాలపై ముందస్తు శిక్షణ అందించాలన్నారు. భక్తులకు బస్సులు, రైళ్ల రాకపోకల వివరాలు తెలియజేయడం, హెల్ప్ డెస్క్‌లు, సమాచార కేంద్రాల్లో సేవలందించడం, చిన్నపిల్లలకు గుర్తింపు ట్యాగులు ఏర్పాటు చేయడం, ఘాట్లు, ఆలయాల వద్ద భక్తులకు సహాయం అందించడం వంటి బాధ్యతలను వాలంటీర్లు చేపట్టవచ్చన్నారు. మహిళా వాలంటీర్ల సేవలను కూడా సమాచార కేంద్రాల్లో విస్తృతంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.
పుష్కరాలు జరిగే 12 రోజుల సమయంలో విద్యార్థులకు కళాశాలల సెలవులు ఉండే నేపథ్యంలో రాజమహేంద్రవరం నగరంతో పాటు కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, పెరవలి, సీతానగరం, ధవళేశ్వరం తదితర ప్రాంతాల్లోని ఘాట్ల వద్ద కూడా విద్యార్థులు తమకు సమీప ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవలు అందించవచ్చన్నారు. ఘాట్ల పరిశుభ్రత, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఆరోగ్య భద్రత వంటి అంశాల్లోనూ వాలంటీర్లు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. విద్యార్థుల ఉత్సాహం, సేవాభావం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన పుష్కర అనుభవాన్ని అందించగలమని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వాలంటీర్ల నియామకం, శిక్షణ, సేవల విభజనకు సంబంధించి కళాశాల ప్రతినిధులు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు.
విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ గోదావరి నది మన ప్రాంతానికి జీవనాధారమే కాకుండా ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల విజయవంతమైన నిర్వహణకు విశ్వవిద్యాలయం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, విద్యార్థి వాలంటీర్లు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు, భక్తులకు సహాయ సహకారాలు అందించడంలో భాగస్వాములు కావాలని సూచించారు. విద్య అనేది తరగతి గదులకే పరిమితం కాకుండా సమాజ సేవ ద్వారా ప్రతిఫలించాలని పేర్కొన్నారు.
సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ మాట్లాడుతూ పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరం నగరంలోని గోదావరి ఘాట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాల వద్ద ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు ఎంతో అవసరమవుతాయని తెలిపారు. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు వాలంటీర్లు క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రూపొందించిన “ఇన్నోవేషన్స్ – గోదావరి పుష్కరాలు” కార్యక్రమ బ్రోచర్లను కలెక్టర్ కీర్తి చేకూరి, ఉపకులపతి ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తదితరులు ఆవిష్కరించారు. అనంతరం అతిథులను విశ్వవిద్యాలయ అధికారులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఆదిత్య శర్మ, డిప్యూటీ కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మార్వో సీహెచ్. దివ్యభారతి, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కె.వి. స్వామి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.