గిన్నిస్ రికార్డు కెక్కిన రెండు నెలల చిన్నారి.
ఫోటో : గిన్నిస్ రికార్డు సాధించిన చిన్నారి దివ్య యాశిక శ్రీ తల్లిదండ్రులతో...
అనకాపల్లి, నవంబర్ 17, మేజర్ న్యూస్: ఏదైనా సాధించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలని కలలు కంటారు. ఇందుకు మార్గాలను అన్వేషించి కఠోర సాధన చేసి తమ కలను నిజం చేసుకుంటారు కొంతమంది. కానీ అనకాపల్లి జిల్లా, మునగపాక మండలం, ఉమ్మలాడ గ్రామానికి చెందిన రెండు నెలలు కూడా నిండని చిన్నారి అనూహ్యంగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. వివరాల్లోకి వెళితే ఉమ్మలాడ గ్రామానికి చెందిన భవానీ సెప్టెంబర్ 18వ తేదీన అనకాపల్లి వర్తక సంఘం ప్రసూతి ఆసుపత్రిలో ప్రసవం దాల్చింది. పుట్టిన ఆడపిల్లకు దివ్య యాశిక శ్రీ అనే పేరు పెట్టారు. పుట్టుకతోనే ఒత్తైన జుట్టు కలిగి ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నెల రోజులు గడిచే సరికి ఏడు సెంటీ మీటర్ల పొడవున జుట్టు పెరగడంతో గ్రామం యావత్తు ఆ చిన్నారిని అద్భుతంగా చూసింది. అసాధారణమైన ఈ ప్రక్రియను చూసి కొంతమంది ఇచ్చిన సలహాతో గిన్నిస్ బుక్ నిర్వాహకులకు ఈ విషయం తెలిపారు. వారు వచ్చి పాప జుట్టును, ఆసుపత్రిలో జన్మించిన రికార్డును పరిశీలించి గిన్నిస్ సర్టిఫికెట్‌తో పాటు మెడల్ కూడా బహుకరించారు. పుట్టుకతోనే పాప గిన్నిస్ రికార్డు నెలకొల్పడంతో తల్లిదండ్రులైన సందీప్, భవానీల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గిన్నిస్ రికార్డు నెలకొల్పిన చిన్నారిని చూడటానికి పరిసర ప్రాంతాల ప్రజలు ఆ గ్రామానికి వెడుతున్నారు.