విదేశీ ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి: ఉపాధి కల్పన అధికారి ఎం. రాధిక
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (నవంబరు 16):జిల్లాలోని నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, అర్హత కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం. రాధిక సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ పరిధిలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో విదేశీ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 19న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అల్వాల్‌లోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనే ఆసక్తి, తగిన అర్హతలు ఉన్న యువతీ యువకులు నిర్ణీత సమయంలో హాజరై పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
నమోదు కోసం పదో తరగతి మెమో, బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజు ఫొటో తీసుకురావాలని తెలిపారు.
మరిన్ని వివరాల కోసం టామ్‌కామ్ అధికారిక వెబ్‌సైట్ www.tomcom.telangana.gov.inను సందర్శించాలని లేదా 080-35524946 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. అదనపు సమాచారం కోసం జిల్లా కలెక్టరేట్‌లోని ఉపాధి కార్యాలయంతో పాటు 9866465024, 7842617596 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం. రాధిక వెల్లడించారు.