విధులు పక్కనపెట్టి పోలీసుల చిందులు.. 14 మందిపై చర్యలు!
సూర్య-గోదావరిఖని:విధి నిర్వహణ సమయంలో బాధ్యతలను విస్మరించి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ డ్యాన్సులు చేసిన పోలీస్ సిబ్బందిపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చర్యలు తీసుకున్నారు. బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణించిన సీపీ.. ఐదుగురు సిబ్బందిని పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ, మరో తొమ్మిది మందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం సహించరాని విషయమన్నారు. ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ గౌరవ ప్రతిష్టలను కాపాడుతూ వృత్తిపరమైన నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినా, శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
-------