పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రసాభాస...
చేర్యాల పట్టణంలో నూతన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దీనికి స్పందించిన ఎంపీ చామల.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందంటూ విమర్శలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో వాతావరణం వేడెక్కింది.పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీఛార్జి చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్రతరం కావడంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ చామల కార్యక్రమాన్ని మధ్యలోనే విడిచిపెట్టి వెనుదిరిగారు. దీంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాజకీయ రగడతో అర్ధాంతరంగా ముగిసింది.