కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు
250 మంది ముత్తయిదులకు వాయనాలు పంపిణీ –
రామలింగేశ్వర ఆలయంలో కార్తీక దీపారాధన
యాదగిరి కొండ మేజర్ న్యూస్.....
పవిత్ర కార్తీక మాసం, కార్తీక సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సాయంత్రం దేవస్థానం ప్రాంగణంలోని అఖండ దీపం వద్ద 250 మంది ముత్తయిదులకు దేవస్థానం తరఫున వాయనాలు పంపిణీ చేశారు. ఈ వాయనాల్లో పసుపు, కుంకుమ, గాజులతో పాటు శ్రీ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వాయనాలు, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా కార్తీక సోమవారం పురస్కరించుకొని దేవస్థానం అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ జె. భవానీ శంకర్ పాల్గొని కార్తీక దీపాన్ని వెలిగించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ కార్తీక దీపం యొక్క ఆధ్యాత్మిక విశిష్టతను తెలియజేస్తూ దీపారాధన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉందని, దీపజ్యోతి దైవానుగ్రహానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త భాస్కర్ నరసింహమూర్తి, మహిళా భక్తులు, ఇతర భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.