ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
రంగారెడ్డి : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 96 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 54, ఇతర శాఖలకు సంబంధించి 42 దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ కె. కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి శారదాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వడ్ల శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్