పిల్లల సమస్యల పరిష్కారానికి ‘పిల్లల ప్రజావాణి’
రంగారెడ్డి : బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ‘పిల్లల ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి చొరవతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
నవంబర్ 14 నుంచి 20 వరకు ‘నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్తు’ అనే నినాదంతో నిర్వహిస్తున్న బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్మయి పిల్లలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. విద్య, ఆరోగ్యం, పోషణ, రక్షణ, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పిల్లలు సమర్పించిన వినతులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. బాలలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
బాలల హక్కుల పరిరక్షణ ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. పిల్లలు తమ సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ‘పిల్లల ప్రజావాణి’ వంటి వేదికలు ఉపయోగపడతాయని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ, బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ డా. కట్టా నరేందర్ రెడ్డి, జువెనైల్ జస్టిస్ బోర్డు సోషల్ వర్కర్ గౌనీ వాసు, బాలరక్షా భవన్ కోఆర్డినేటర్ రోజా, జిల్లా బాలల పరిరక్షణ అధికారి డా. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వడ్ల శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్