ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలి డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు
సూర్య - పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా విజయవంతం చేయాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఐడీఓసీ నుంచి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖేలో ఇండియా క్రీడలపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలని, విద్యార్థులు, యువతతో పాటు ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రారంభోత్సవాలు నిర్వహించి, పట్టణాల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.డిసెంబర్ 11 నుంచి 22 వరకు 12 రోజుల పాటు జరిగే ఈ క్రీడా సంబరాల్లో దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 6 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 29 క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వివిధ క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రీడల ద్వారా యువతను వ్యసనాలకు దూరంగా ఉంచి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.