andhrapradesh
స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో గ్రంథాలయ ఉద్యమ నిర్మాణం - విశ్రాంత అధికారి పి.వి. మల్లేశ్వర్
గుంటూరు న్యూస్: స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు గ్రంథాలయ ఉద్యమం కూడా సమాంతరంగా, ఒకే స్ఫూర్తితో నడిచిందని విశ్రాంత పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీ పి.వి. మల్లేశ్వర్ అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ భీమనేని వందనా దేవి అధ్యక్షతన జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మూడవ రోజు సోమవారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. తొలుత గ్రంథాలయ ఉద్యమ వైతాళికులు అయ్యంకి వెంకటరమణయ్య, ఎస్.ఆర్. రంగనాథన్, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాతూరి నాగభూషణం చిత్రపటాలకు చైర్‌పర్సన్ భీమనేని వందనా దేవి, కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ, ముఖ్య అతిథులు పి.వి. మల్లేశ్వర్, విశ్రాంత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉప్పుల శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథి పి.వి. మల్లేశ్వర్ మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమకారుల సేవలను స్మరించుకున్నారు. జాతీయ నాయకుడు అయ్యంకి వెంకటరమణయ్య స్వాతంత్ర్య, గ్రంథాలయ ఉద్యమాలను అన్నాచెల్లెళ్లలా ముందుకు నడిపించారని కొనియాడారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో గణిత ఆచార్యుడిగా పనిచేసిన ఎస్.ఆర్. రంగనాథన్ గ్రంథాలయ శాస్త్రంపై మక్కువతో 'గ్రంథాలయ పంచ సూత్రాలు', 'కోలన్ క్లాసిఫికేషన్' రచించి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చారని తెలిపారు. అలాగే గాడిచర్ల హరిసర్వోత్తమరావు జాతీయ స్థాయిలో, పాతూరి నాగభూషణం ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించారని గుర్తుచేశారు. ప్రజలకు చేరువయ్యేందుకు 'బోటు గ్రంథాలయ సేవలు' అందించడంతో పాటు 1919లో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహాసంఘాన్ని స్థాపించిన ఘనత వారిదేనని పేర్కొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు…వారోత్సవాలలో భాగంగా చైర్‌పర్సన్ భీమనేని వందనా దేవి, కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మల ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. "మొబైల్ ఫోన్ కంటే పుస్తకం మిన్న", "డిజిటల్ యుగంలో పుస్తకాల ప్రాధాన్యత" అనే అంశాలపై జరిగిన ఈ పోటీలలో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన బాలబాలికలు పెద్ద ఎత్తున, ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప గ్రంథపాలకురాలు కె. ఝాన్సీ లక్ష్మి, జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.