andhrapradesh
గృహ స్థలాల రెగ్యులరైజేషన్ విచారణ పక్కాగా ఉండాలి--జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ
గుంటూరు న్యూస్: గృహ స్థలాల రెగ్యులరైజేషన్ ప్రక్రియకు విచారణ పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. వివిధ విభాగాల క్రింద నిర్దేశిత ప్రదేశంలో నివాస భవనాలు, తదితర అంశాలపై కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డికెటి, జి.ఓ 30, 306, దేవదాయ భూములు, వక్ఫ్, అభ్యంతరకర భూములు, ఇతర విభాగాల క్రింద ఉన్న భూములను విచారణ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో సూచించిన విధంగా వివిధ విభాగాల వారీగా ఉన్న స్థలాల్లో ఉన్న వారి అర్హతను గుర్తించాలని చెప్పారు. ఇందుకు గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు పొందాలని స్పష్టం చేశారు. చెరువులు, కాలువలు, దారులు తదితర అభ్యంతర విభాగాల క్రింద ఉన్న స్థలాలను పక్కాగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. జలవనరుల శాఖ, భూగర్భ జలాల శాఖ తదితర సంబంధిత శాఖల నుండి నివేదికలు పొందాలని సూచించారు. వీటిని అమలు చేయుటకు స్పష్టమైన విధి విధానాలు (ఎస్.ఓ.పి) తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, తదితరులు పాల్గొన్నారు.