"వాగ్దానాల వర్షం.. అమలులో కరువు!" రైతు బతుకు బాగుపడేదెప్పుడు? హామీలు నెరవేరేదెప్పుడు? రైతు కన్నీటికి బాధ్యులెవరు? రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేశంనేనిపల్లి నుంచి 20 కుటుంబాలు బీఆర్ఎస్‌లో చేరిక
దేవరకొండ ప్రతినిధి నవంబర్ 16:( మేజర్ న్యూస్ )
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాటల గారడీలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగాలు, ప్రతిపక్షాలపై విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే వారి ఆగ్రహం సునామీలా మారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు.సోమవారం దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గుడిపల్లి మండలం కేశంనేనిపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
రైతు సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతాంగం ఎంతో భరోసాతో వ్యవసాయం చేసిందని రవీంద్ర కుమార్ గుర్తుచేశారు. రైతుల కష్టాలను గుర్తించి వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యం, సకాలంలో యూరియా, ఎరువుల పంపిణీ, పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధు వంటి పథకాలతో రైతులకు భరోసా కల్పించిందని పేర్కొన్నారు. పంటలు పండించిన రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు.
అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు గతంలో అందిన భరోసా కొరవడిందని విమర్శించారు. విద్యుత్ సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా, ఇతర ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవడంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
హామీలు అమలు చేయాలి.. రైతులకు అండగా నిలవాలి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని రవీంద్ర కుమార్ మండిపడ్డారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, సాగునీరు, సకాలంలో ఎరువులు అందించడంతో పాటు రైతు సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు సైతం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, కనీస అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని, వాటిని పక్కనపెట్టి ప్రసంగాలతో కాలయాపన చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటల గారడీలు కట్టిపెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు. కేసీఆర్ హయాంలో అమలైన రైతు సంక్షేమ పథకాలను తిరిగి సాధించుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.
విమర్శలు కాదు.. రైతు సమస్యలకు పరిష్కారాలు కావాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనల్లో చేస్తున్న ప్రసంగాలు, సునామీలు సృష్టిస్తామంటూ చేస్తున్న వ్యాఖ్యలపై రవీంద్ర కుమార్ ఘాటుగా స్పందించారు. రూ.50 లక్షల లంచం ఇస్తూ పట్టుబడి జైలుకు వెళ్లింది ఎవరో, అసలైన కేడీ ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించకుండా డొల్ల ప్రసంగాలతో ప్రజలను మభ్యపెట్టలేరని పేర్కొన్నారు. రైతుల కడుపు మండితే వారి ఆగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని, ఆ ఆగ్రహ సునామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే పాలకుల ప్రథమ కర్తవ్యమని, ఆ దిశగా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు.
20 కుటుంబాలు బీఆర్ఎస్‌లో చేరిక
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెల్లుగురి వల్లపు రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అర్వపల్లి నర్సింహ, సర్పంచులు కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రైనబోయిన శ్రీను, దూదిపాల రాజేందర్ రెడ్డి, తోటకూరి పరమేష్, ఎర్ర యాదగిరి, బొడ్డుపల్లి మహేందర్, బొగది కృష్ణారెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.కేశంనేనిపల్లి గ్రామం నుంచి పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమావత్ రవి, మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు రమావత్ యాదగిరి, వార్డు సభ్యులు రమావత్ నాగు, జటావత్ అచ్చి, రమావత్ హనుమంత్, కాంగ్రెస్ నాయకులు రామావత్ భగవాన్, భాస్కర్, అనిల్, బాల్ సింగ్, రమేష్, మూడవతు రెడ్డి, రమావత్ రమేష్, వెంకట్రామ్, దేవ్ సింగ్, బాలు నాయక్, బిక్షం, మోతిలాల్, దానవత్ సాంబ, రమావత్ ముఖేష్ తదితరులు ఉన్నారు.