నగర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.. పబ్లిక్ హెల్త్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్..
(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్..)
నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డంపింగ్ యార్డు నిర్మాణ పనులపై సమీక్షించి, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఇటీవల ప్రారంభించిన అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకుని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.అలాగే నగరంలో ఇంకా చేపట్టాల్సిన అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలపై ప్రత్యేక దృష్టి సారించి, మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.నగర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పష్టం చేశారు.