andhrapradesh
ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత పనులను తక్షణమే పూర్తి చేయాలి --నగర కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు న్యూస్: గుంటూరు నగరంలోని ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత పనులు సక్రమంగా చేపట్టాలని, ప్రస్తుతం తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో నగరంలో ఎక్కడా ముంపుకు గురికాకుండా పూడికతీత పనులు పక్కాగా జరగాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. తుఫాన్ సన్నద్ధతపై సోమవారం కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులకు ప్రత్యేకంగా పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వర్షపు నీరు, మురుగునీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రధాన డ్రెయిన్ల నుండి పూడికను సోమ, మంగళవారాల్లో పూర్తిస్థాయిలో తొలగించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా కంకరగుంట ఆర్యూబి నుండి శ్రీనివాసరావు తోట శ్మశానవాటిక వరకు ఉన్న పీకలవాగు, చుట్టగుంట జంక్షన్ మెయిన్ డ్రెయిన్, ఏటుకూరు రోడ్డులోని బృందావన్ అపార్ట్‌మెంట్స్ పక్కనున్న మేజర్ డ్రెయిన్ నుండి ఎల్ఆర్ కాలనీ మెయిన్ రోడ్డు కల్వర్టు వరకు, నల్లచెరువు మెయిన్ రోడ్డు, కలెక్టర్ ఆఫీస్ రోడ్డులో రమేష్ హాస్పిటల్స్ నుండి ఆర్ఓబి వరకు, నల్లపాడు రోడ్డులో చుట్టుగుంట హౌసింగ్ బోర్డు కాలనీ నుండి రెండు వైపులా, గుజ్జనగుండ్ల నుండి కొరిటెపాడు పార్క్ వరకు రెండు వైపులా ఉన్న డ్రెయిన్లలో పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. అలాగే అమరావతి రోడ్డులో లాడ్జ్ సెంటర్ నుండి చిల్లీస్ వరకు రెండు వైపులా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జంక్షన్ నుండి బస్టాండ్ మీదుగా మణిపురం ఆర్ఓబి వరకు రెండు వైపులా, ఓల్డ్ క్లబ్ రోడ్డుకు రెండు వైపులా, శనక్కాయల ఫ్యాక్టరీ (3 వంతెనలు) జంక్షన్ నుండి విజయవాడ రోడ్డు వరకు ఉన్న మెయిన్ డ్రెయిన్, ఓల్డ్ గుంటూరు – నందివెలుగు మెయిన్ రోడ్డుకు రెండు వైపులా ఉన్న డ్రెయిన్లలో పూడికను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు. సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పై ప్రాంతాలన్నింటినీ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. అన్ని డ్రెయిన్లలో నూరు శాతం పూడికతీత జరిగేలా చూడటంతో పాటు, తొలగించిన పూడికను ఎక్కడికక్కడ తక్షణమే తరలించి, సక్రమంగా డిస్పోజ్ చేయాలన్నారు. పూడికతీత పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎటువంటి అలసత్వం లేకుండా పూర్తి చేయాలని, పనులు పూర్తయిన వెంటనే లొకేషన్ వారీగా తీసుకున్న చర్యల నివేదికను ఫోటోలతో సహా సమర్పించాలని పేర్కొన్నారు.