వరికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి : వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. శ్రీకృష్ణ, డా. దిలీప్
షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 16) యాసంగి సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు. షాబాద్ మండలం సంకేపల్లిగూడ గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సహకారంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరిలో క్షేత్ర పాఠశాల శిక్షణ, యాసంగి కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రం, హయత్‌నగర్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. జి. శ్రీకృష్ణ, డా. దిలీప్ ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డా. దిలీప్ మాట్లాడుతూ... వరి సాగులో పంట వివిధ దశల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సమతుల్య ఎరువుల వినియోగం, పోషకాల నిర్వహణ, చీడపీడలు, తెగుళ్ల నివారణపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని, సరైన సమయంలో తగిన చర్యలు తీసుకుంటే పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని మంచి దిగుబడులు సాధించవచ్చని వివరించారు. డా. జి. శ్రీకృష్ణ మాట్లాడుతూ... సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలు, కూరగాయల వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు. కూరగాయల సాగులో నాణ్యమైన విత్తనాల ఎంపిక, నాటే విధానం, ఎరువులు, నీటి యాజమాన్యం, చీడపీడలు, తెగుళ్ల నివారణపై పలు సూచనలు చేశారు. రైతులు అడిగిన సందేహాలకు శాస్త్రీయంగా సమాధానాలు ఇచ్చారు.
ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి...
మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర మాట్లాడుతూ... యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయలు, పశుగ్రాసం సాగు చేయాలనుకునే రైతులు తమ వివరాలను సంబంధిత క్లస్టర్ పరిధిలోని ఏఈఓల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. కూరగాయలు, పశుగ్రాసం విత్తనాలతో పాటు డ్రిప్, స్ప్రింక్లర్లు, పందిళ్లు, మల్చింగ్ షీట్లు అవసరమైన రైతులు ముందుగానే వివరాలు అందించాలని కోరారు. అలాగే ఒకేచోట సమూహంగా 25 ఎకరాల వరకు పంటలు సాగు చేసే రైతులకు కోతులు, అడవి పందుల బెడద నుంచి పంటలను రక్షించేందుకు సోలార్ ఫెన్సింగ్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
పొలాలను సందర్శించి పంటల పరిశీలన
అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులతో కలిసి వివిధ పంటల పొలాలను సందర్శించి పంటల ఎదుగుదల, సాగు విధానాలు, నీటి వినియోగాన్ని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమ్మరి లావణ్య చెన్నయ్య, ఉప సర్పంచ్ ప్రభాకర్, షాబాద్ ఎఫ్‌పీఓ సీఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓలు శివతేజ, మౌనిక, బాబ్యా నాయక్, శివకుమార్, రాజేశ్వరి, శైలజ, పంచాయతీ కార్యదర్శి ఫయాజ్, పొలంబడి రైతు యాదవరెడ్డి, ఎరువులు, విత్తనాల డీలర్లు రాజశేఖర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శివరాములు, నరసింహారెడ్డి, నర్సింలు, సత్తయ్యతో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.