గణాంకాల సేకరణలో సమన్వయం కీలకం -ఏఐఎస్హెచ్ఈ సర్వేలో చురుకైన భాగస్వాములు కావాలి : ఆచార్య విజయభాస్కరరావు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : వైద్య విద్యాసంస్థల ప్రగతికి సమగ్ర గణాంకాల సేకరణ, శాఖల మధ్య సమన్వయం కీలకమని,వైద్య, ఆరోగ్య విద్యా సంస్థలు ఏఐఎస్హెచ్ఈ సర్వేలో చురుకైన భాగస్వాములు కావాలని ఏపీ ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జి ఛైర్మన్ ఆచార్య విజయభాస్కరరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యా విభాగం సహకారంతో ఉన్నత విద్యా గణాంకాల సేకరణ, నమోదుపై ప్రాంతీయ ఏఐఎస్హెచ్ఈ అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం ప్రణాళిక, వాస్తుకళ విద్యాలయం వేదికగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలల నోడల్ అధికారుల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏపీ ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జి ఛైర్మన్ ఆచార్య విజయభాస్కరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
-సమగ్ర సమాచారాన్ని పారదర్శకంగా నమోదు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య విద్యా సంస్థలు ఏఐఎస్హెచ్ఈ సర్వేలో చురుకుగా పాల్గొని, తమ పరిధిలోని విద్యాసంస్థలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు. వైద్య, ఆరోగ్య రంగాలు సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థలని, ఈ రంగాలకు చెందిన విద్యాసంస్థలు మరింత ప్రగతిని సాధించేందుకు నాణ్యమైన గణాంకాల సేకరణ, విశ్లేషణ దోహదపడతాయని పేర్కొన్నారు. ఆయా శాఖలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల మధ్య సమన్వయం ఉన్నప్పుడే సమగ్ర సమాచారాన్ని సేకరించి జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యా రంగ ప్రగతిని సమర్థవంతంగా ప్రతిబింబించగలమని తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన గణాంకాల నమోదులో ప్రతి సంస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వాస్తవ సమాచారాన్ని సకాలంలో సమర్పించాలని స్పష్టం చేశారు.
అభివృద్ధి రూపకల్పనలో గణాంకాలే కీలకం
యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బి.రాజశేఖర్ మాట్లాడుతూ ఉన్నత విద్యాసంస్థలకు సంబంధించిన ప్రామాణిక గణాంకాలు విద్యా ప్రణాళికలు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఏపీ ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్పర్సన్, రాష్ట్ర ఏఐఎస్హెచ్ఈ నోడల్ అధికారి ఆచార్య కె. రత్న షీలా మణి మాట్లాడుతూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్హెచ్ఈ గణాంకాల నమోదుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
-గణాంకాల సమర్పణలో పారదర్శకత..
మండలి కార్యదర్శి ఆచార్య బి.తిరుపతిరావు మాట్లాడుతూ గణాంకాల సమర్పణలో ఖచ్చితత్వం, విశ్వసనీయత, పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయి సుధీర్ మాట్లాడుతూ అనుబంధ కళాశాలలు సమగ్ర సమాచారాన్ని సకాలంలో అందించడం ద్వారా సర్వే ప్రక్రియను విజయవంతం చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించిన ఆచార్య బి.రాజశేఖర్, న్యూఢిల్లీకి చెందిన ఏఐఎస్హెచ్ఈ ప్రోగ్రామర్ శివం పాండేలు ఏఐఎస్హెచ్ఈ పోర్టల్లో డేటా నమోదు, సమాచార సేకరణ, పత్రాల నిర్వహణ, గణాంకాల సమర్పణ విధానాలపై నోడల్ అధికారులకు ప్రాయోగిక అవగాహన కల్పించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి అకడమిక్ ఆఫీసర్ డాక్టర్ ఎం.ప్రదీప్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్