రైతులకు సకాలంలో పారదర్శకంగా ఎరువులు అందిస్తాం
- ఆర్‌ఎస్‌కే సిబ్బంది, డీలర్ల సమావేశంలో ఏవో అబ్రహం లింకన్
పామూరు, మేజర్ న్యూస్ : రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో పారదర్శకంగా అందించడంతో పాటు విక్రయాలలో జరిగే అక్రమాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌ను రూపొందించిందని వ్యవసాయ అధికారి అబ్రహం లింకన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది, ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యం అని తెలిపారు.రైతులు ఇకపై ఎరువుల కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకుని ఎరువులు పొందవచ్చు అన్నారు. అన్నదాతలకు నాణ్యమైన ఎరువులను సరసమైన ధరలకే అందించడం జరుగుతుందన్నారు. ఆన్‌లైన్ బుకింగ్ విక్రయాల విధానంపై రైతులకు, ఆర్‌ఎస్‌కే సిబ్బందికి, ప్రైవేట్ దుకాణాల యజమానులకు ఆయన అవగాహన కల్పించారు.రైతులు తాము సాగు చేసే పంటలకు అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడకుండా సమతుల్య ఎరువులను మాత్రమే వినియోగించాలి అని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ విస్తరణ అధికారి నగేష్, ఆర్‌ఎస్‌కే సిబ్బంది, ప్రైవేట్ ఎరువుల దుకాణాల యజమానులు పువ్వాడి రామారావు, ముప్పసాని క్రాంతి తదితరులు పాల్గొన్నారు.