ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఈసీఐ తాజాగా లేఖలు పంపింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి అంటే నవంబర్ 18 నుండి 30వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ) ద్వారా ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, ఇంటింటి సర్వే ప్రక్రియ జరగనుంది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు మరియు తొలగింపులకు సంబంధించి వచ్చిన అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది.
అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం పూర్తయిన తర్వాత డిసెంబర్ 22న ఓటర్ల తుది జాబితాను ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, బోగస్ ఓట్లు, డబుల్ ఎంట్రీలను పూర్తిస్థాయిలో తొలగించి అత్యంత పారదర్శకమైన, కచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఈ ప్రత్యేక సవరణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నిర్దేశిత గడువులోగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీఐ రాష్ట్ర ఎన్నికల యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.