కంబదూరులో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి. ఎస్సై గోపి.
కంబదూరు: మండలంలోని 12 గ్రామ పంచాయతీల పరిధిలో గత మూడు రోజులుగా కొనసాగిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి అభ్యర్థికి, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు స్థానిక ఎస్ఐ గోపి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. ఎవరికి వారు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడకూడదని హెచ్చరించారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, వారి అనుచరులు సంయమనం పాటిస్తూ ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, డబ్బు లేదా ఇతర వస్తువుల ఆశ చూపడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు భంగం కలిగించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రతి ఓటరు స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ అవసరమైన భద్రత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఎవరైనా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ గోపి యాదవ్ విజ్ఞప్తి చేశారు.