BREAKING
హౌస్ పల్లిలో ఘనంగా సదర్ సమ్మేళన వేడుకలు బీఏఎస్‌ఎఫ్–ఎవోనిక్ మెగా టేకోవర్ డీల్‌.. మరింత ఆకర్షణీయమైన కొత్త ఆఫర్‌కు సిద్ధమవుతున్న BASF! ఓఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... డీఐపీఆర్‌వో చెన్నకేశవరావుకు సహచర ఉద్యోగుల ఘన సత్కారం.. ఆదరించండి అండగా ఉంటాను... చైనా–చిలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం.. ఏఐ , సముద్ర పరిశోధన రంగాల్లో సహకారం పెంపు! రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట పోలీసు భద్రత.. షాహీనా కుటుంబానికి అండగా హరీష్ రావు -ఎమ్మెల్యే సహకారంతో ఆర్థిక సాయం అందజేత రోజూ ఉడికించిన గుడ్డు తింటే నిజంగా కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్య నిపుణులు ఇస్తున్న అసలు సమాచారం ఇదే అమెరికా మార్కెట్లలో టెక్నాలజీ షేర్ల భారీ పతనం.. సేల్స్‌ఫోర్స్‌, సర్వీస్‌నౌ స్టాక్స్‌కు గట్టి దెబ్బ! అమెరికా మార్కెట్లలో టెక్నాలజీ షేర్ల భారీ పతనం.. సేల్స్‌ఫోర్స్‌, సర్వీస్‌నౌ స్టాక్స్‌కు గట్టి దెబ్బ! సైబర్ నేరం కేసులో విద్యుత్ శాఖ ఒప్పంద ఉద్యోగి అరెస్ట్.. 11 నెలలుగా వేతనాలేవీ..? స్వచ్ఛ కార్మికుల ఆగ్రహం! కారంమెతుకులతో డీఈఓ ఎదుట నిరసన.. కలెక్టరేట్ ముట్టడి నామినేషన్ కేంద్రాలు పరిశీలించిన ఆర్డీఓ ,డియస్పి కోటబొమ్మాళి రాజకీయాల్లో ‘బోయిన సోదరుల’ ప్రస్థానం

తాటిపాకలో గ్యాస్ కలకలం

Select Suryaa Now
తాటిపాకలో గ్యాస్ కలకలం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం గెద్దాడ నగరం సమీపంలోని తాడివారిమెరక గ్రామ పరిధిలో ఉన్న తాటిపాక-7 ఓఎన్‌జీసీ వెల్‌ రిగ్‌ వద్ద మంగళవారం తెల్లవారుజామున గ్యాస్‌ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉదయం 5 నుంచి 5.30 గంటల మధ్య రిగ్‌ నుంచి గ్యాస్‌ భారీగా వెలువడటంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టి ప్రమాద తీవ్రత పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఓఎన్‌జీసీ సాంకేతిక బృందం ముమ్మరంగా చేపట్టిన చర్యలతో మధ్యాహ్నం 3 గంటలకల్లా గ్యాస్‌ లీకేజీని పూర్తిగా అరికట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం, అగ్నిప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

భయాందోళనలో పరిసర గ్రామాలు:

గ్యాస్‌ లీకేజీ సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రిగ్‌ చుట్టూ 500 మీటర్ల పరిధిలో నివసిస్తున్న సుమారు 200 నుంచి 300 కుటుంబాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన సదుపాయాలు కల్పించారు. ముందస్తు జాగ్రత్తగా సమీపంలోని 216వ జాతీయ రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిసర గ్రామాలకు విద్యుత్‌ సరఫరాను కూడా నిలిపివేశారు. గ్యాస్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి నిప్పు, మంటలు వెలిగించవద్దని, విద్యుత్‌ దీపాలు, అగ్నికి సంబంధించిన పరికరాలు వినియోగించరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఆరు అగ్నిమాపక శకటాలతో వాటర్‌ కర్టెన్‌:

ఉదయం 7.30 గంటలకల్లా నరసాపురం, ఓఎన్‌జీసీ బేస్‌ టీమ్‌లకు చెందిన అత్యవసర స్పందన బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మొత్తం ఆరు అగ్నిమాపక శకటాలతో నిరంతర వాటర్‌ కర్టెన్‌ ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ రక్షణ చర్యలు చేపట్టారు. పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ, ఓఎన్‌జీసీ సిబ్బంది సమన్వయంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు చేపట్టిన నిరంతర ప్రయత్నాలు ఫలించడంతో మధ్యాహ్నం 3 గంటలకు గ్యాస్‌ లీకేజీ పూర్తిగా ఆగిపోయింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవడంతో 216వ జాతీయ రహదారిపై రాకపోకలను, సమీప గ్రామాలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా మరో 48 గంటల పాటు ఘటనా స్థలాన్ని నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించారు. మూడు అగ్నిమాపక శకటాలను అక్కడే అందుబాటులో ఉంచనున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ;

గ్యాస్‌ లీకేజీ సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్‌ డా. ఆర్‌. మహేష్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఓఎన్‌జీసీ అధికారులతో మాట్లాడి లీకేజీ నియంత్రణ చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చి సహాయక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ తెలిపారు.

అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష:

తాటిపాక-7 ఓఎన్‌జీసీ రిగ్‌ వద్ద గ్యాస్‌ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఫోన్‌ చేసి పరిస్థితిని సమీక్షించారు. లీకేజీకి గల కారణాలు, నియంత్రణకు చేపడుతున్న చర్యలు, పరిసర ప్రాంతాల ప్రజల భద్రతకు తీసుకుంటున్న జాగ్రత్తలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.