కోటబొమ్మాళి రాజకీయాల్లో ‘బోయిన సోదరుల’ ప్రస్థానం
: - ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి బోయిన రమేష్ సతీమణి!
కోటబొమ్మాళి, నవంబరు 17, మేజర్ న్యూస్: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కోటబొమ్మాళి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కోటబొమ్మాళి అనగానే రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ వెంటనే గుర్తుకు వచ్చే పేరు ‘బోయిన కుటుంబం’. దశాబ్దాలుగా ప్రజాసేవలో, ప్రత్యక్ష రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన బోయిన గోవిందరాజులు, బోయిన రమేష్‌లను స్థానికులు ముద్దుగా ‘ అపూర్వ సహోదరులు ' అని పిలుచుకుంటారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ, ఈ సోదరుల కుటుంబం మరో కీలక రాజకీయ అడుగు వేయబోతోంది.
ఉద్ధండులతో సాన్నిహిత్యం.. సేవా దృక్పథం
బోయిన సోదరులకు కేవలం నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా, జిల్లా నలుమూలలా మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థానాల్లో ఉన్న రాజకీయ, పరిపాలనా ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య , మాజీ కేంద్ర మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు మాజీ డీజీపీ దివంగత హెచ్ జే దొర వంటి ప్రముఖులతో వీరికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది.ఈ పరిచయాలను తమ వ్యక్తిగత ఎదుగుదల కంటే, ప్రాంత అభివృద్ధికి మరియు ప్రజల సమస్యల పరిష్కారానికే వీరు ఉపయోగించారు.
నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం
బోయిన గోవిందరాజులు రాజకీయ ప్రయాణం 1981లో ప్రారంభమైంది. తొలుత సహకార సంఘం (కో-ఆపరేటివ్ సొసైటీ) అధ్యక్షుడిగా ఎన్నికై రైతులకు విశేష సేవలందించారు. 1988 నుంచి సుమారు 14 ఏళ్ల పాటు కోటబొమ్మాళి మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా గోవిందరాజులు పనిచేశారు. ఆ తర్వాత ఆయన సతీమణి శారదమ్మ కూడా 6 సంవత్సరాల పాటు సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించి, మేజర్ పంచాయతీపై చెరగని ముద్ర వేశారు. తమ కుటుంబమే కాకుండా, తమ సహాయ సహకారాలతో కమ్మకట్టు అప్పలరాజు రెడ్డి, దేవాది సింహాద్రమ్మల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ మేజర్ పంచాయతీ సర్పంచ్‌లుగా గెలిపించి పంచాయతీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక
1995లో కాంగ్రెస్ పార్టీని వీడిన ఈ సోదరులిద్దరూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. బోయిన గోవిందరాజులు ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర కళింగ వైశ్య కార్పోరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా ఎదిగారు. బోయిన రమేష్ సామాజిక సమీకరణాల పరంగా మైనార్టీ వర్గానికి (కళింగ వైశ్య) చెందినప్పటికీ, కోటబొమ్మాళి వంటి కీలక మండలానికి సుమారు 20 ఏళ్ల పాటు టీడీపీ మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేసి పార్టీ విజయాల్లో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షునిగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఏకతాటిపై క్యాడర్.. రమేష్ సతీమణికి సర్పంచ్ అవకాశం!
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోటబొమ్మాళి పంచాయతీ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటివరకు తెరవెనుక ఉండి పార్టీని నడిపించిన బోయిన రమేష్, ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల పదవులను ఆశించలేదు. అయితే, ఈసారి పంచాయతీ సర్పంచ్ పీఠం బోయిన రమేష్ కుటుంబాన్ని వరించనుంది. కోటబొమ్మాళి సర్పంచ్ అభ్యర్థిగా బోయిన రమేష్ సతీమణి రమాబాయి బరిలోకి దిగనున్నట్లు టీడీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు అందాయి. అగ్రనేతలైన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ల పూర్తి ఆశీస్సులు బోయిన సోదరులకు ఉండటం వీరికి పెద్ద బలంగా మారింది.
క్యాడర్ మద్దతు: దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన రమేష్ కుటుంబానికి అవకాశం రావడంతో, కోటబొమ్మాళి పంచాయతీలోని టీడీపీ క్యాడర్ అంతా విభేదాలు లేకుండా ఏకతాటిపై నిలిచి గెలుపు కోసం సిద్ధమవుతోంది.మొత్తానికి, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, అగ్రనేతల ఆశీస్సులు, కార్యకర్తల అండదండలతో కోటబొమ్మాళి పంచాయతీ ఎన్నికల్లో బోయిన కుటుంబం మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమైంది.