అక్వాన్ తుపానుపై రైతులు జాగ్రత్తగా పాటించాలి
వరి కోతలు వాయిదాలు అవసరం
ఆమదాలవలస, నవంబర్ 17, మేజర్ న్యూస్
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమదాలవలస మండల పరిధిలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు సూచించారు.
తుపాను ప్రభావం తగ్గి వాతావరణం పూర్తిగా అనుకూలించే వరకు వరి పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలన్నారు. ఇప్పటికే కోత కోసిన వరి పనలు వర్షానికి తడవకుండా టార్పాలిన్ పట్టాలతో కప్పి భద్రపరచాలి. నూర్పిడి చేసిన ధాన్యాన్ని పొలాల్లో వదిలివేయకుండా సురక్షితమైన, ఎత్తైన ప్రదేశాలకు తరలించాలి. ధాన్యం రాశులపై టార్పాలిన్ పట్టాలు కప్పి వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యం నిల్వ చేసే ప్రదేశాల్లోకి వర్షపు నీరు చేరకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. వర్షానికి తడిసిన ధాన్యాన్ని వాతావరణం అనుకూలించిన వెంటనే ఆరబెట్టుకోవాలి. కోత యంత్రాలు, ఇతర వ్యవసాయ పరికరాలను సురక్షిత ప్రదేశాల్లో ఉంచుకోవాలి. భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో వ్యవసాయ పనులకు వెళ్లకూడదు. వాతావరణ శాఖ జారీ చేసే తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలి. తుపాను ప్రభావం తగ్గే వరకు రైతులు అప్రమత్తంగా ఉండి తమ పంటను, ధాన్యాన్ని నష్టం వాటిల్లకుండా కాపాడుకోవాలని సూచించారు.