బ్యాడ్మింటన్ లో చిన్నారుల షటిల్ యుద్ధం -ఫైనల్స్ లో హోరాహోరీ పోరులో విశాఖ హవా
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :
తిరుపతి వేదికగా 4 రోజుల పాటు జరిగిన యోనెక్స్-సన్ రైజ్ ఏపీ స్టేట్ అండర్-13 బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ చిన్నారుల షటిల్ మెరుపులతో అదరగొట్టారు.చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఈ నెల 14న ప్రారంభమైన యోనెక్స్-సన్ రైజ్ ఏపీ స్టేట్ అండర్-13 బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు 4 రోజుల పాటు ఉత్సాహభరితంగా సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన చిన్నారులు కోర్టులో సీనియర్లను తలపించే ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఫైనల్ పోటీల్లో విశాఖపట్నం చిన్నారులు విశేష ప్రతిభ కనబరిచి ముందంజలో నిలిచారు. ప్రతి మ్యాచ్ లోనూ నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. భవిష్యత్ స్టార్లుగా ఎదిగే సత్తా ఈ చిన్నారుల్లో పుష్కలంగా ఉందని కోచ్ లు ప్రశంసించారు.మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు ఆనందరెడ్డి, మాజీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు సూరా సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ చన్నారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.రామకృష్ణయ్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ రావు, కోశాధికారి జి.శివయ్య, కిరణ్ కుమార్, మునస్వామి, శ్రీధర్ రెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు.ఈ టోర్నీ యువ క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కని వేదికగా నిలిచిందని నిర్వాహకులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్