ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా.. 19 నుంచి అమలు: చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి మేజర్ న్యూస్: ఆపద సమయంలో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయనుందని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల వయసున్న కుటుంబ యజమానికి రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.మంగళవారం మేడ్చల్ నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించిన ఆయన అత్తివెల్లిలోని జీఎన్‌ఆర్ కన్వెన్షన్, దమ్మాయిగూడలోని సాయి భవాని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం తూముకుంటలోని ఇందిరమ్మ ఇళ్ల పరిసరాల్లో రూ.5 కోట్ల నిధులతో చేపట్టనున్న వ్యర్థ, వర్షపు నీటి ప్రవాహ కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడ ఆర్‌జీకే కాలనీలో మరో రూ.5 కోట్లతో చేపట్టనున్న కాల్వల నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.63 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.114 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా 25,553 మందికి పింఛన్లు మంజూరయ్యాయని వివరించారు. నియోజకవర్గాల వారీగా మేడ్చల్‌లో 6,681, ఉప్పల్‌లో 4,278, మల్కాజిగిరిలో 2,705, కుత్బుల్లాపూర్‌లో 6,685, కూకట్‌పల్లిలో 5,203 మందికి పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, రూ.500కే వంటగ్యాస్ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పేదల సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు అందించే సంక్షేమమే శాశ్వతమని పేర్కొన్నారు. ఇంకా పింఛన్లు అందని అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని సూచించారు.ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ను రూ.4 వేలకు పెంచి అందించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని వెళ్లాలని సూచించారు.జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే పథకాలను విజయవంతంగా అమలు చేయవచ్చని అన్నారు.ఇదిలా ఉండగా, కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడ సాయి భవాని ఫంక్షన్ హాల్‌లో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దమ్మాయిగూడ, జవహర్‌నగర్, చంద్రపురి కాలనీ, కీసర డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు ఉత్తర్వులు అందజేశారు. కీసర సర్కిల్ పరిధిలో సుమారు 2,500 మందికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరైనట్లు నాయకులు తెలిపారు.డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రామలింగం, ఎల్లంపేట్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీదేవి, వైస్ చైర్‌పర్సన్ రజిత దేవేందర్, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిసరి మహిపాల్ రెడ్డి, హజ్ కమిటీ సభ్యుడు మహమ్మద్ ముజీబ్ రుద్దీన్, శామీర్‌పేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నక్క సందీప్ గౌడ్, దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షుడు ముప్పా రామారావు, జవహర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు శాంతి కోటేష్ గౌడ్, చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, కీసర డివిజన్ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయరెడ్డి, బి-బ్లాక్ మహిళా అధ్యక్షురాలు ఈగ శ్వేత, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.