అర్హులందరికీ సంక్షేమ పథకాలు.. సిద్దిపేట తరహాలో వికారాబాద్ అభివృద్ధి చేస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్లో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య హాజరై లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని మేకల గండిలో రూ.200 కోట్లతో పాఠశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, గ్రేటర్ హైదరాబాద్‌లో నాలుగు దిక్కులా పెద్ద ఆసుపత్రుల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో మరో రెండు బ్రిడ్జిలను కూడా నిర్మిస్తామని వెల్లడించారు.వికారాబాద్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, విమర్శలు చేసే ముందు జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించాలని సూచించారు. నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని, కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందించేలా ఈ పథకాన్ని రూపొందించారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేశామని, రైతులకు అందాల్సిన సబ్సిడీలను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన మహిళలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని వివరించారు.వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి అధిక నిధులు తీసుకొస్తున్నానని స్పీకర్ తెలిపారు. ఇప్పటికే రూ.1,000 కోట్ల నిధులతో రోడ్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అన్ని గ్రామాలు, మండలాలకు రహదారులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్ పట్టణంలోని ప్రతి గల్లీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్యతో కలిసి పట్టణాన్ని సిద్దిపేట తరహాలో సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నారని అన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య మాట్లాడుతూ… పార్టీలకు అతీతంగా వికారాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సిద్దిపేట తరహాలో సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇప్పటికే పలు వార్డుల్లో రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, మిగతా ప్రాంతాల్లోనూ త్వరలో పనులు చేపడతామని చెప్పారు. అన్ని పార్టీల నాయకుల సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని పేర్కొన్నారు. తమ కుటుంబం మొదటి నుంచి ప్రజాసేవలో ఉందని, తాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని, ప్రజల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యం సేటు, కిషన్ నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.