గ్యాస్ పైప్‌లైన్ పనులు వేగవంతం చేయాలి మార్చి 2028 నాటికి పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు
సూర్య - పెద్దపల్లి : రామగుండం, పెద్దపల్లి మీదుగా కరీంనగర్ వరకు చేపడుతున్న గ్యాస్ స్టీల్ పైప్‌లైన్ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులు, ప్రాజెక్టు ప్రతినిధులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.కుందనపల్లి నుంచి కరీంనగర్‌లోని బొమ్మకల్ వరకు మొత్తం 50 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కుందనపల్లి నుంచి పెద్దపల్లి వరకు 22 కిలోమీటర్లకు గాను 10.88 కిలోమీటర్లు, పెద్దపల్లి నుంచి బొమ్మకల్ వరకు 28 కిలోమీటర్లకు గాను 12.58 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ఇంటిక్యాల వద్ద జాతీయ రహదారి 563 క్రాసింగ్‌కు అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందాలని, శాఖల మధ్య సమన్వయంతో పనుల్లో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. మొత్తం ప్రాజెక్టును మార్చి 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ పైప్‌లైన్ అందుబాటులోకి వస్తే గృహాలకు పైపుల ద్వారా సహజ వాయువు (పీఎన్‌జీ), వాహనాలకు సిఎన్‌జీ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, సంబంధిత శాఖల అధికారులు, ప్రాజెక్టు ప్రతినిధులు పాల్గొన్నారు.