అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఇబ్రహీంపూర్ తండాలోని పాఠశాలలో అడవి ఆముదం గింజలను బాదం గింజలుగా భావించి తినడంతో పది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్న భోజనం అనంతరం విరామ సమయంలో పాఠశాల పరిసరాల్లో ఉన్న అడవి ఆముదం కాయలను ఓ విద్యార్థిని తీసుకొచ్చి బాదం గింజలని చెప్పి తోటి విద్యార్థులకు ఇచ్చింది. దీంతో వాటిని తిన్న పది మంది విద్యార్థులు కొద్దిసేపటికే వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే టీ. రామ్మోహన్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యుల వివరాల ప్రకారం తొమ్మిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, ముందస్తు జాగ్రత్తగా 48 గంటల పాటు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. రెండో తరగతి చదువుతున్న భావన అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. పరిగి మండల విద్యాధికారి అంజనేయులు కూడా ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలోనే మరుగుదొడ్లు అందుబాటులో ఉంటే విద్యార్థులు బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి పాఠశాలలో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.