ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్
అమరావతి: బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న 'అక్వాన్' తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఇటీవల రాష్ట్రాన్ని తాకిన గత రెండు తుఫాన్ల కంటే 'అక్వాన్' తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నవంబర్ 20 మధ్యాహ్నం సమయంలో నెల్లూరు–తుని మధ్య ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచడంతో పాటు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలను గుర్తించి తక్షణమే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభావిత జిల్లాలలో ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను ముందస్తుగా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ, ముంపు ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు, ఆహారం, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, వాగులు వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించాలని సూచించారు. ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను క్షేత్రస్థాయికి చేరవేస్తూ తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.