MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్, బెదిరింపుల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న 'హైదరాబాద్ యూత్ కరేజ్' (HYC) నిర్వాహకుడు సల్మాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ బ్లాక్‌మెయిల్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ఫాతిమా బేగం, మహ్మద్ మోసిన్ ఖాన్ సహా ఆరుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా సల్మాన్ ఖాన్ అరెస్టుతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. విచారణలో భాగంగా సల్మాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరచగా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఎమ్మెల్సీని లక్ష్యంగా చేసుకుని సాగిన ఈ బెదిరింపుల వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.