ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ
గుంటూరు : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, సదుపాయాలను రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంగళవారం స్తంభాల గరువులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు, ఏటీ అగ్రహారంలోని ఎస్‌కేబీఎం పాఠశాలను సందర్శించి, అక్కడ సక్రమంగా పనిచేయని వాటర్ ఆర్‌ఓ ప్లాంట్లను పరిశీలించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి, రెండు పాఠశాలల్లో వాటర్ ఆర్‌ఓ ప్లాంట్ల నిర్వహణకు అవసరమైన ఖర్చుల విషయంలో తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా పాఠశాలల్లో నెలకొన్న ఇతర సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు, నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడం ఎంతో ముఖ్యమని, ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల మెరుగుదలకు నిరంతరం కృషి చేస్తానని ఎంపీ భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు.
కే నాగరాజు గుంటూరు క్రైమ్