నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి అండగా ఉంటాం. ఎమ్మెల్యే అమిలినేని.
కళ్యాణదుర్గం: నాయిబ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. నాయిబ్రాహ్మణులు ఆర్థికంగా ఎదిగి సమాజంలో గౌరవప్రదమైన స్థాయికి చేరుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని భరోసా కల్పించారు. మంగళవారం కళ్యాణదుర్గం పట్టణంలోని టీ కూడలిలో నిర్వహించిన ధన్వంతరి జయంతి మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర నాయిబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఉప్పటూరి బాల గురుస్వామి, రాష్ట్రస్థాయి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి ఆలయ కమిటీలో నాయిబ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు నాయిబ్రాహ్మణులు కూడా సహకరించాలని కోరారు. సంప్రదాయ వృత్తితో పాటు ఆధునిక వ్యాపార రంగంలోనూ రాణించాలని, కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సదుపాయాలతో సెలూన్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. ధన్వంతరి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అలాగే నాయిబ్రాహ్మణుల చిరకాల ఆకాంక్ష అయిన కళ్యాణదుర్గంలో కళ్యాణమంటపం నిర్మాణానికి స్థలం కేటాయించే అంశంపై సానుకూలంగా స్పందించారు. ఎన్నికల అనంతరం జిల్లా కలెక్టర్, ఆర్డీఓలతో చర్చించి స్థల కేటాయింపునకు అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయిబ్రాహ్మణులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వారి అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయిబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు, సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.