పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం
పూతలపట్టు మేజర్ న్యూస్
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం పూతలపట్టు శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి తాళ్ల రవీంద్రబాబు ఆధ్వర్యంలో 'అష్టదిగ్గజాలు' పేరిట కవి సమ్మేళన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్. ఎస్. శర్మ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో గ్రంథాలయాల పాత్ర, కవుల కలం బలం ఎంతో కీలకమని, పుస్తక పఠనం వల్ల మనిషిలో విజ్ఞానంతో పాటు వివేకం పెరుగుతుందని తెలిపారు గ్రంథాలయాలకు మూలస్తంభాలైన కవులు, రచయితల ఆవశ్యకత నేటి సమాజానికి ఎంతో ఉందని, వారి రచనలే భావి తరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు అనంతరం నిర్వహించిన 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన 8 మంది కవులు, కవయిత్రులు తమ గళాన్ని వినిపించి శ్రోతలను ఆకట్టుకున్నారు డా. కె. దామోదరాచారి (యాదమరి), పత్తిపాటి రమేష్ నాయుడు (దామలచెరువు), మోహన శేఖర్, నందిని (తిరుపతి), ఆనగల్లు మునిరత్నం (పూతలపట్టు), నాదముని (రంగంపేట), టి. రవీంద్రబాబు (పూతలపట్టు), దివ్యశ్రీ (పూతలపట్టు) తదితరులు తమ కవితలను వినిపించడం జరిగింది సామాజిక స్పృహ, దేశభక్తి, తెలుగు భాషా ఔన్నత్యం, నేటి సమాజంలో పెడదారి పడుతున్న నాగరికతా ధోరణులు వంటి సమకాలీన అంశాలపై వారు చేసిన కవితా పఠనం సభికులను ఎంతగానో ఆలోచింపజేసింది కార్యక్రమం ముగింపులో, అద్భుతమైన కవితలతో సభకు వన్నె తెచ్చిన కవులు, కవయిత్రులను నిర్వాహకులు, ముఖ్య అతిథి చేతుల మీదుగా దుశ్శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సాహితీ వేడుకలో స్థానిక విద్యార్థులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు, సాహితీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్