చెయ్యి లేదు 'చేయూత' లేదు..ఒంటి చేత్తో కుటుంబ భారాన్నిమోస్తున్న ఓ దివ్యాంగుని దీన గాధ.
కుషాయిగూడ నవంబర్ 17. మేజర్ న్యూస్..: తల్లి గర్భం నుండే అవిటితనాన్ని అండగా తెచ్చుకున్న రవి చిన్నతనంలోనే కర్ణాటక నుండి బతుకుతెరువు కోసం పట్నం వచ్చి, గత పదేళ్లుగా జవహర్ నగర్ లోని న్యూ దేవేందర్ నగర్ బస్తిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. చెయ్యి లేదు చేయూతలేదు అవిటితనానికి ఆసరా అసలే లేదని ప్రస్తుత హస్తం ప్రభుత్వ హయాంలో ఈ అభాగ్యుడ్ని ఆదుకునే వారే లేరా? అంటూ జవహర్ నగర్ ప్రజలు నిలదీస్తున్నారు. వివరాల్లోకెళితే
ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్న రవికి రెండు సంవత్సరాల పాప, ఐదేళ్ల బాబు ఉన్నారు. సొంత కష్టాన్నే నమ్ముకున్న రవి అడ్డ మీద కూలిగా మారి, రెండు చేతులు ఉన్నవారు చేయలేని పనులను ఒంటిచేత్తో చేస్తూ.. వచ్చిన అరకొర సంపాదనతో ఇంటి అద్దె కట్టడం, పిల్లల పోషణ, ఇంటి ఖర్చులతో బతుకు బండిని లాగుతున్నాడు.
పుట్టెడు కష్టాలు:
చిన్ననాటి నుండి చేయి లేక పోయినా అతనికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆసరా పింఛన్ అందలేదు, సొంతింటి కలా నెరవేరలేదు, కృత్రిమ అవయవము దక్కలేదు. ఏళ్లతరబడి ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ..అధికారులను నాయకులను ఎంతగా ప్రాధేయ పడిన్నప్పటికీ కనికరం చూపలేదు పలితం దక్కలేదు.!
పక్కాగా చట్టాలు అమలు:
దివ్యాంగులకు నివాసం కల్పించడం కోసం ప్రత్యేక చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ అటు పదేళ్ల కేసీఆర్ పాలనలో గాని ఇటు మూడేళ్ల ఇందిరమ్మ ప్రజా పాలనలో గాని డబుల్ బెడ్ రూమ్ ఇల్లును పొందలేదు, కనీస ఆసరా అందలేదు.
అవిటితనం మూలంగా చదువు లేకపోవడంతో వారి హక్కులు వారికి తెలియకుండా పోయాయి. ప్రభుత్వ పథకాల వివరాలు తెలియక పోవడం, తెలిసినా వాటిని పొందే మార్గం కనబడక రవి లాంటి వారెందరో దివ్యాంగులు మన మద్యే నివసిస్తూ నానా అవస్థలు పడుతున్నారు.
అధికారులు ఆదుకోవాలి:
ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, ఆర్ డీ ఓ, జిల్లా కలెక్టర్ దివ్యాంగుడైన రవిని గుర్తించి అతనికి వెంటనే ఆసరా పింఛన్ తో పాటు, డబల్ బెడ్ రూమ్ ఇల్లును కేటాయించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పలు దివ్యాంగుల సంఘాలు, నాయకులు కోరుతున్నారు.