రజక సోదరుడిపై దాడి ఘటనపై సంఘం ఆగ్రహం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
చిలకలూరిపేట మేజర్ న్యూస్: చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాల ప్రాంతంలో నివాసం ఉంటున్న రజక సామాజిక వర్గానికి చెందిన ఏలిపాటి రమేష్‌పై జరిగిన దాడి ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని రజక సంఘం సభ్యులు పేర్కొన్నారు.ఆదివారం స్థానికంగా చోటుచేసుకున్న చిన్నపాటి వివాదం ఘర్షణకు దారితీసి,నలుగురు వ్యక్తులు కలిసి రమేష్‌పై దాడి చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.ఈ క్రమంలో రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయని,కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ఆసుపత్రికి,అనంతరం గుంటూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆయన పరిస్థితి విషమంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని,మరో ప్రధాన నిందితుడిని కూడా వెంటనే అరెస్టు చేసి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రజక సంఘం డిమాండ్ చేసింది.బాధిత కుటుంబానికి సంఘం అండగా నిలుస్తుందని,న్యాయం జరిగే వరకు ఐక్యంగా పోరాడుతామని సంఘం సభ్యులు స్పష్టం చేశారు.ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా నిందితులకు చట్టప్రకారం శిక్ష పడాలని కోరారు.
కొణిదెన నరేంద్ర: చిలకలూరిపేట సూర్య రిపోర్టర్