రిజిస్టర్ స్థలంలోనే దారి వివాదం.. పనులు చేసుకోనివ్వకుండా అడ్డంకులు!
సైదాపురం, మేజర్ న్యూస్ : సైదాపురం మండల కేంద్రంలోని ఏపీ హాస్టల్ పక్కన స్థల వివాదం చోటుచేసుకుంది. తన పేరుపై రిజిస్టర్ అయిన స్థలంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్న తనను మరో మహిళ అడ్డుకుంటూ, తనకు దారి ఇవ్వాలంటూ ఇబ్బందులకు గురిచేస్తోందని చింతా రవీణ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చెందిన స్థలంలో ఏళ్లుగా పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో వాటిని తొలగించి, స్థలాన్ని చదును చేసి ప్రహరీ గోడ నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే తాను తన స్థలంలో పనులు చేసుకుంటుండగా మరో మహిళ వచ్చి అడ్డుపడుతూ, దారి ఇవ్వాలని ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. తన పేరుపై రిజిస్టర్ అయిన స్థలంలో తాను పనులు చేసుకునే హక్కు ఉన్నప్పటికీ, పదేపదే అడ్డంకులు సృష్టిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని చింతా రవీణ వాపోయారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి స్థలాన్ని పరిశీలించి, వాస్తవ పరిస్థితులను విచారించి న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. తన స్థలంలో తాను ప్రశాంతంగా పనులు చేసుకునే పరిస్థితి కల్పించాలని, స్థల వివాదానికి అధికారులు చొరవ తీసుకొని శాశ్వత పరిష్కారం చూపాలని చింతా రవీణ మీడియా పరంగా విజ్ఞప్తి చేశారు