ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా?
గాజువాక, మేజర్ న్యూస్: జీవీఎంసీ 103వ వార్డు పరిధిలోని అగనంపూడి జనవాసాల మధ్య ఇటీవల ఏర్పాటు చేసిన మద్యం దుకాణం తీవ్ర వివాదాస్పదంగా మారింది. జాతీయ రహదారి నుంచి స్టీల్ జనరల్ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారిలో, అగనంపూడి శ్మశానవాటిక ఎదురుగా ఉన్న వీఎంఆర్ కాంప్లెక్స్ పక్కనే 'ఆర్‌జీఎస్' పేరుతో ఈ వైన్ షాపును ప్రారంభించారు. చుట్టూ దట్టంగా నివాస గృహాలు ఉన్న ప్రాంతంలో, కనీసం వాణిజ్య భవనం (కమర్షియల్) కూడా కాకుండా ఏకంగా ఒక నివాస గృహంలోనే మద్యం దుకాణం తెరవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఇళ్ల మధ్యన వైన్ షాప్ ఏర్పాటు చేయడానికి లైసెన్స్ ఉందా? ఒకవేళ ఉన్నా ఆ లైసెన్స్ సరిగ్గా ఇదే ప్రాంతానికి కేటాయించారా? లేదా నిబంధనలకు విరుద్ధంగా ఒక నివాస గృహంలోనే దుకాణం పెట్టుకోవడానికి ఎక్సైజ్ అధికారులు అనుమతులు ఇచ్చారా? అనే ప్రశ్నలు స్థానికంగా తలెత్తుతున్నాయి. ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా సాగుతున్న ఈ వ్యవహారమంతా ఎక్సైజ్ అధికారులకు తెలిసే జరుగుతోందా? అన్న అనుమానాలను కాలనీవాసులు వ్యక్తం చేస్తున్నారు.
జనవాసాల నడుమ ఈ మద్యం దుకాణం తెరవడంతో కేవలం పక్కనే ఉన్న వీఎంఆర్ కాంప్లెక్స్‌కు సినిమాలు, షాపింగ్ నిమిత్తం వచ్చే మహిళలు, కుటుంబ సభ్యులకే కాకుండా.. స్థానిక కాలనీవాసులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ తీవ్ర అసౌకర్యం కలుగుతుందని స్థానికులు వాపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వైన్ షాప్ ఉండటం వల్ల రాకపోకలు సాగించేందుకు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు భవిష్యత్తులో ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే ప్రశాంతంగా ఉండే తమ నివాస ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని స్థానిక నివాసితులు భయాందోళన చెందుతున్నారు.
ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా విస్మరించి, నిబంధనలకు తూట్లు పొడుస్తూ నివాస గృహంలో ఏర్పాటు చేసిన ఈ మద్యం దుకాణంపై ఎక్సైజ్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ వైన్ షాపు అనుమతులను రద్దు చేయాలని, ప్రజలకు ఇబ్బందికరంగా మారిన ఈ దుకాణాన్ని వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలని కాలనీవాసులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టర్ : పీ.కోటిరెడ్డి, గాజువాక ఇంచార్జ్, విశాఖపట్నం