పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి
సూర్య - మానకొండూర్ :నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ముంజంపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇది నియంతృత్వ ప్రభుత్వం కాదని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వమని అన్నారు. గతంలో ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు అందక, ఈఎంఐలు కట్టలేక సిబిల్ స్కోర్ దెబ్బతిని అప్పులు పుట్టే పరిస్థితి ఉండేది కాదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఠంచనుగా మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. పేద పిల్లల చదువు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో రెండు జతల యూనిఫామ్, బూట్లు ఇవ్వడమే కాకుండా, వారం రోజుల పాటు విభిన్న రకాల అల్పాహార కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని యాదవులపల్లె, తిమ్మాపూర్లలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
19న ఇందిరమ్మ జీవిత బీమా ప్రారంభం:
భూమి లేని నిరుపేద కుటుంబాలకు అండగా నిలబడేందుకు ఈ నెల 19వ తారీఖున సిద్దిపేటలో ముఖ్యమంత్రి 'ఇందిరమ్మ జీవిత బీమా' పథకాన్ని ప్రారంభిస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. ఈ పథకం ద్వారా కుటుంబ పెద్ద మరణిస్తే రూ. 5 లక్షల బీమా అందుతుందని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షల బీమా, సాధారణ మరణం సంభవిస్తే రూ. 2 లక్షల ఆర్థిక సాయంతో పాటు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు.జిల్లాలోనే అత్యధికంగా మానకొండూరు మండలానికి 1,406 నూతన చేయూత పింఛన్లు మంజూరయ్యాయని, దీని ద్వారా ప్రతి నెలా రూ. 2,48,14,464/- లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. గతంలో ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక వైద్యం అందని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం పెండింగ్ బిల్లులు చెల్లించి, రూ. 10 లక్షల వరకు ఎల్ఓసీ ఇస్తూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని సూచించారు. గుడిసెలు లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రి ఖర్చులను ప్రభుత్వం భరిస్తోందని, లబ్ధిదారులందరూ సంతోషంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మానకొండూరు స్పెషల్ ఆఫీసర్ సరస్వతి, తహశీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో వివి వరలక్ష్మి, ఏఎంసీ ఛైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ ఛైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి, సొసైటీల ఛైర్మన్లు నాగిశెట్టి రాజయ్య, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, ఆర్. లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్ర చారి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, లబ్ధిదారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.