telangana
అర్హులైన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు కృషి చేస్తా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం
కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు అండగా నిలుస్తామని, అర్హులైన ఉద్యమ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని కెకె కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం హామీ ఇచ్చారు.
మంగళవారం ఎల్బీనగర్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర ఎంతో కీలకమైందని, ఉద్యమ సమయంలో అనేక ఇబ్బందులు, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రజల్లో చైతన్యం కల్పించడంలో జర్నలిస్టులు విశేష కృషి చేశారని కొనియాడారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ఉద్యమ జర్నలిస్టుల సేవలను గుర్తించి, వారికి తగిన న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన ఉద్యమ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే అంశంపై సంబంధిత అధికారులతో, ప్రభుత్వ పెద్దలతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే అర్హులైన ఉద్యమ జర్నలిస్టుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ చేపడతామని వివరించారు. అర్హతలను పరిశీలించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.