జీవ వనరుల కేంద్రం సమగ్ర సస్య రక్షణ అవగాహన సమావేశం
రైతులు క్రిమి సంహరక మందుల వాడకం తగ్గించి సమగ్ర సస్య రక్షణ పద్ధతులను అవలంభించాలి విశ్రాంత ఎడి కె.వీరయ్య చౌదరి మరియు సీఐపియం అధికారులు మౌనిక, మానస
ముద్దనూరు మేజర్ న్యూస్: మండలంలోని కొత్తపల్లె గ్రామ సమీపంలో ఉన్న జగత్ జనని జీవ వనరుల కేంద్రం దగ్గర కేంద్రీయ సమగ్ర సస్య రక్షణ పద్ధతుల విభాగం విజయవాడ వారి ఆధ్వర్యంలో రెండో రోజు శిక్షణా కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విశ్రాంత ఎడి కె.వీరయ్య చౌదరి మాట్లాడుతూ సమగ్ర సస్య రక్షణ పద్ధతుల గురించి వివరించారు. వేప నూనె వాడకం, పసుపు రంగు జిగురు అట్టలు, లింగా కర్షక బుట్టల గురించి వివరించారు.ఖేత్ బచావో అభియాన్ గురించి సమగ్రంగా రైతులతో చర్చించారు. రాబోయో రోజుల్లో నేలను ఆరోగ్యవంతముగా ఉండేటట్లు కాపాడుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్సీ వ్యవసాయ అధికారిణి పట్నం పద్మజ మాట్లాడుతూ రైతులు భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి భూమిలో పోషకాల లోపాలను గుర్తించి అందుకు అనుగుణంగా ఎరువులు వాడుకోవాలి అని తెలిపారు.జీవ నియంత్రణ పద్ధతులను అనుసరించి పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించ వచ్చును అన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు సమగ్ర సస్య రక్షణ పద్ధతులను అవలంభించి పంటలు సాగు చేసుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చునని తెలిపారు. పకృతి వ్యవసాయ పద్ధతుల గురించి సిబ్బందికి, రైతులకు అవగాహన కల్పించారు.రానున్న రోజుల్లో క్రిమి సంహరక మందుల వాడకం తగ్గించి సమగ్ర పద్ధతులను అనుసరించి పంటలు సాగు చేస్తే మంచి ఫలితాలు పొందడం సులభం అన్నారు. అనంతరం అభ్యుదయ రైతు మునగాల ద్వారక నాథ్ రెడ్డి మాట్లాడుతూ జీవ వనరుల కేంద్రము లో తయారు చేసే ఉత్పత్తుల గురించి,వాటిని వాడుకునే విధానము లో మెళకువలు గురించి అవగాహన కల్పించారు.సహజ సిద్ధ వ్యవసాయ పద్ధతుల అనుసరిస్తే నేల ఆరోగ్యముతో పాటు, మానవుల ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చును అన్నారు. అనంతరం నిమ్మ చెట్లలో అంతరపంటగా సాగు చేసిన పెసర పంట ను పరిశీలించి,తగు సూచనలు సలహాలు అందించారు.అలాగే నిమ్మ చెట్లకు ఆశించే వివిధ రకాల సూక్ష్మ పోషకాల లోపాలను పరిశీలించి వాటి నివారణ పద్ధతులను తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది మరియు పకృతి వ్యవసాయ సిబ్బంది మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.