సోమశిలలో సాయంత్రం వేళ ఆవుల బెడద.. పట్టించుకోని అధికారులు!
అనంతసాగరం, మేజర్ న్యూస్ : మండలం సోమశిల గ్రామంలో ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎక్కడెక్కడి నుంచో పెద్ద సంఖ్యలో ఆవులు గ్రామంలోకి వస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని ప్రధాన వీధులు, రహదారులపై ఆవులు గుంపులుగా సంచరిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ సమస్య రోజూ ఎదురవుతున్నప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి ఆవుల యజమానులను గుర్తించి, గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈ సమస్యపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి!