దివ్యాంగుడికి ఉచితంగా మూడు చక్రాల వాహనం అందజేసిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య
వికారాబాద్, మేజర్ న్యూస్: పేదలు, దివ్యాంగుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య అన్నారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో, స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మంగళవారం వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారూర్ మండలం దోర్నాల గ్రామానికి చెందిన దివ్యాంగుడు భాస్కర్ నాయక్‌కు GYYAK ట్రస్ట్ ద్వారా ఉచితంగా మూడు చక్రాల వాహనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పేదలు, దివ్యాంగులు, అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో తాము కూడా అవసరమైన వారికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మూడు చక్రాల వాహనం అందుకున్న భాస్కర్ నాయక్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చైర్‌పర్సన్ గడ్డం అనన్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాన్ సింగ్, ధారూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాములు, సీనియర్ నాయకులు బాబా ఖాన్, బుజ్జయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.