కళ్యాణదుర్గం సబ్ డివిజన్లో మూడవరోజు జోరుగా కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ.
కళ్యాణదుర్గం :-గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ మూడో రోజు మరింత ఊపందుకుంది. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల స్వీకరణలో అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. 10 మండలాల పరిధిలోని 161 గ్రామ పంచాయతీలు, 1,722 వార్డులకు సంబంధించి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మూడో రోజు ఒక్కరోజే 550 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,189 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. దీంతో మూడు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు మొత్తం 1,241 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 3,531 నామినేషన్లు నమోదయ్యాయి. మండలాల వారీగా పరిశీలిస్తే సర్పంచ్ స్థానాలకు కనేకల్ మండలంలో అత్యధికంగా 152 నామినేషన్లు నమోదయ్యాయి. సెట్టూరు మండలంలో 143, బొమ్మనహాల్, గుమ్మగట్ట మండలాల్లో 142 చొప్పున, కుందుర్పిలో 135, రాయదుర్గంలో 121, కళ్యాణదుర్గంలో 118, కంబదూరులో 101, బ్రహ్మసముద్రంలో 94, డి.హీరేహాల్ మండలంలో 93 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు కంబదూరు మండలంలో అత్యధికంగా 430 నామినేషన్లు నమోదయ్యాయి. కనేకల్‌లో 409, కళ్యాణదుర్గంలో 376, సెట్టూరులో 368, రాయదుర్గంలో 361, కుందుర్పిలో 354, బ్రహ్మసముద్రంలో 332, బొమ్మనహాల్‌లో 322, గుమ్మగట్టలో 302, డి.హీరేహాల్‌లో 277 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో రోజు నామినేషన్లలో కూడా పలు మండలాల్లో అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్పంచ్ స్థానాలకు గుమ్మగట్ట మండలంలో అత్యధికంగా 83 నామినేషన్లు, కుందుర్పిలో 76, కనేకల్‌లో 68, సెట్టూరులో 65, కంబదూరులో 52, కళ్యాణదుర్గంలో 53 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు కంబదూరులో 333, బ్రహ్మసముద్రంలో 263, కుందుర్పిలో 253, సెట్టూరులో 247, కళ్యాణదుర్గంలో 244, కనేకల్‌లో 210 నామినేషన్లు మూడో రోజు నమోదయ్యాయి. మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియకు విశేష స్పందన లభించడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ముందుకు రావడంతో రానున్న రోజుల్లో గ్రామస్థాయిలో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.