భక్తి శ్రద్ధలతో గోదావరి హారతి కార్యక్రమం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
కొవ్వూరు స్థానిక గోష్పాద క్షేత్రంలో సోమవారం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని దాస సాహిత్య ప్రాజెక్టు, తిరుపతి వారి నిర్వహణలో గోదావరి హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై గోదావరి హారతిలో పాల్గొన్నారు.
టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్. ఆనందతీర్థాచార్యులు గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు కార్తీక మాస విశిష్టత, గోదావరి నది పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాధాన్యతపై భక్తులకు ప్రవచనం చేశారు. కార్తీక మాసంలో నదీ స్నానాలు, దీపారాధనలు, హారతుల నిర్వహణ ద్వారా కలిగే ఆధ్యాత్మిక విశిష్టతను వివరించారు.
ఈ సందర్భంగా గోదావరి నదికి ప్రత్యేక హారతి సమర్పించగా, భక్తులు భక్తిపారవశ్యంతో పాల్గొన్నారు. గోదావరి నది పవిత్రతను కాపాడుకోవడంతో పాటు ఆధ్యాత్మిక సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయని కార్యక్రమంలో వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు ఆర్డీఓ కె. ఆనందరావు, టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రతినిధులు, సంబంధిత అధికారులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.