బోల్తా పడిన లారీ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఅనపర్తి మండలం లక్ష్మీనరసాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వర్టు వద్ద రక్షణ గోడ లేకపోవడంతో లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న పంట బోదిలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.లక్ష్మీనరసాపురం సమీపంలోని కల్వర్టు వద్ద రక్షణ గోడలు లేకపోవడం వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ ప్రాంతంలో ప్రయాణించే వాహనదారులకు కల్వర్టు నిర్మాణం స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించేలా హెచ్చరిక బోర్డులు, రేడియం రిఫ్లెక్టర్లు కూడా ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న కల్వర్టుల వద్ద రక్షణ గోడలు నిర్మించాలని, అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, రేడియం రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని వాహనదారులు, స్థానిక గ్రామస్థులు కోరుతున్నారు. మరోసారి ఇటువంటి ప్రమాదం చోటుచేసుకుని ప్రాణనష్టం సంభవించకముందే అధికారులు తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.