పదవి కోసం కాదు.. గ్రామ ప్రగతి కోసమే పోటీ! అభివృద్ధి పనులతో ప్రజల మనసు గెలుస్తా! ఐదేళ్లలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి
చిట్టమూరు మేజర్ న్యూస్
గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, ప్రజాసేవే ధ్యేయమని ఎల్లసిరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పోచారెడ్డి సుకుమార్ రెడ్డి తన అభివృద్ధి ప్రణాళికలతో ప్రజలకు సేవ చేస్తానని వెల్లడించారు. సర్పంచ్‌గా తనకు అవకాశం కల్పిస్తే ఐదేళ్లలో ఎల్లసిరి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.గ్రామంలో రోడ్లు,తాగునీరు,వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తానన్నారు. విద్య,వైద్యం,వ్యవసాయం, యువతకు అవకాశాలు, మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ చూపుతానన్నారు.
పంచాయతీకి వచ్చే ప్రభుత్వ నిధులను పారదర్శకంగా వినియోగిస్తూ,ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యతకు పెద్దపీట వేస్తానని పేర్కొన్నారు.ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తూ, వారి భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని స్పష్టం చేశారు.
మేజర్ న్యూస్ ప్రత్యేక ముఖాముఖిలో ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి గ్రామాభివృద్ధి ప్రణాళికలు,మౌలిక సమస్యల పరిష్కారం,నిధుల పారదర్శక వినియోగం,ప్రజాసేవపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
ప్రశ్న: సర్పంచ్‌గా ఎన్నికైతే ఐదేళ్లలో గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు?
సమాధానం: గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతోపాటు విద్య, వైద్యం,వ్యవసాయ రంగాలపై దృష్టి సారిస్తాను.ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే నా లక్ష్యం.
ప్రశ్న: గ్రామంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి మీ కార్యాచరణ ఏమిటి?
సమాధానం:ముందుగా గ్రామంలోని ప్రతి వీధిని సందర్శించి సమస్యలను గుర్తిస్తాను.ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టి, అధికారుల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తాను.
ప్రశ్న: పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత ఎలా పాటిస్తారు?
సమాధానం: ప్రజాధనం ప్రజల కోసమే వినియోగిస్తాను. నిధుల ఖర్చు, అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ అవినీతికి తావులేని పాలన అందిస్తాను.
ప్రశ్న: గెలిచిన తర్వాత పంచాయతీకి ఏం చేస్తారు?
సమాధానం: అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళికగా మార్చి దశలవారీగా అమలు చేస్తాను. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సూచనలు,విమర్శలను స్వీకరిస్తాను.నా పనితీరును ప్రజలే సమీక్షించేలా జవాబుదారీతనంతో వ్యవహరిస్తాను.
ప్రశ్న: మీ ప్రత్యర్థులతో పోలిస్తే ప్రజలు మిమ్మల్నే ఎందుకు ఎన్నుకోవాలి?
సమాధానం: ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం నా ఉద్దేశం కాదు.నా సేవా దృక్పథం,అభివృద్ధి ఆలోచనలు,ప్రజల పట్ల నిబద్ధతే నా ప్రత్యేకత.అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధితో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.
పదవి అనేది అధికారం చెలాయించడానికి కాదని,ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నానని సుకుమార్ రెడ్డి పేర్కొన్నారు. పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనులే తనకు నిజమైన గుర్తింపునివ్వాలని,ఐదేళ్ల తర్వాత ఎల్లసిరి గ్రామంలో కనిపించే మార్పే తన పనితీరుకు నిదర్శనంగా నిలవాలని ఆకాంక్షించారు.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్