andhrapradesh
ఆభరణాలకు మెరుగుల పేరుతో మోసాలకు పాల్పడే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి...
- విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్....
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు అందించాలన్న జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్
విజయనగరం, సూర్య: జిల్లాలో బంగారు, వెండి ఆభరణాలకు మెరుగులు పెడతామంటూ గ్రామాల్లో సంచరిస్తూ, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటువంటి వ్యక్తుల మాయమాటలకు మోసపోయి విలువైన ఆభరణాలను కోల్పోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మాట్లాడుతూ బంగారు, వెండి ఆభరణాలకు మెరుగులు పెడతామని, వాటిని శుభ్రం చేసి కొత్తవాటిలా తయారు చేస్తామని చెబుతూ గ్రామాల్లో తిరిగే అపరిచిత వ్యక్తుల మాటలను నమ్మవద్దన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి, గ్రామ శివార్లలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకునే అపరిచిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. అమాయక ప్రజలను గుర్తించి, వారితో పరిచయం పెంచుకొని, మాయమాటలతో నమ్మించి బంగారు ఆభరణాలను అపహరించే అవకాశం ఉందని, అటువంటి అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒంటరిగా నివసించే వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నందున, ఇటువంటి మోసాలపై అవగాహన కల్పించాలన్నారు. బంగారు, వెండి ఆభరణాలను శుభ్రం చేస్తామని లేదా మెరుగులు పెడతామని ఇంటికి వచ్చే అపరిచితులను ఇంట్లోకి అనుమతించవద్దని, వారి చేతికి ఆభరణాలు ఇవ్వవద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆభరణాలను వారి వద్దకు తీసుకెళ్లి శుభ్రం చేయించవద్దని, అవసరమైతే నమ్మకమైన, గుర్తింపు కలిగిన ఆభరణాల దుకాణాల్లోనే సేవలు పొందాలన్నారు. మోసగాళ్లు ఆభరణాలను శుభ్రం చేసే సమయంలో వాటి అసలు బరువు, నాణ్యతను మార్చడం లేదా వాటిని మార్చి వేరే వస్తువులు ఇవ్వడం వంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నా, గ్రామాల్లో తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100/112 కు సమాచారం అందించాలన్నారు. గ్రామాల్లో గ్రామ పోలీసు, మహిళా పోలీసు, గ్రామ వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వివాహాలు, శుభకార్యాలు జరిగే కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, ఇతర వేడుకల వేదికల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా సంబంధిత యాజమాన్యాలకు అవగాహన కల్పించాలన్నారు. చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరిగిన వెంటనే పరిసర ప్రాంతాల పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసి, నిందితుల ఆచూకీ గుర్తించేందుకు కంట్రోల్ రూం, స్పెషల్ బ్రాంచ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ సమన్వయంతో పనిచేయాలన్నారు. నేరం జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిందితులు ప్రయాణించిన మార్గాలు, ఉపయోగించిన వాహనాలు, వారి కదలికలను గుర్తించి త్వరితగతిన పట్టుకోవాలన్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడే పాత నేరస్తులు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచి, వారి నేర చరిత్రను పరిశీలించాలన్నారు. నేర తీవ్రత, చట్టపరమైన నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అర్హులైన నిందితులపై పీడీ యాక్ట్ అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల అప్రమత్తతే నేరాల నివారణకు తొలి మెట్టని, అపరిచిత వ్యక్తుల మాయమాటలకు ఆకర్షితులై విలువైన బంగారు, వెండి ఆభరణాలను కోల్పోవద్దని జిల్లా ఎస్పీ సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం అందిస్తూ, నేరరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ విజ్ఞప్తి చేశారు.