రేపు మెదక్ జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన బొడ్మట్‌పల్లిలో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు
మెదక్ ప్రతినిధి ; తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ ఆదివారం (నవంబర్ 15) మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటన షెడ్యూల్‌ను ఆయన కార్యాలయం అధికారికంగా విడుదల చేసింది.పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఎంఆర్సీ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ముత్తంగి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 11:30 గంటలకు మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లిలోని శ్రీరామ గార్డెన్ అండ్ ఫంక్షన్ హాల్‌కు చేరుకుంటారు.అక్కడ నిర్వహించనున్న చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు బొడ్మట్‌పల్లి నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 3:20 గంటలకు సంగారెడ్డికి చేరుకుంటారు. అక్కడ స్థానిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.మంత్రి పర్యటన నేపథ్యంలో అవసరమైన వసతి, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. అదేవిధంగా మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత, ఎస్కార్ట్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.మంత్రి పర్యటనకు సంబంధించి తదుపరి కార్యక్రమాల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.