*కుందుర్పిమండలంలో పంచాయతీ పోరు రసవత్తరం*
కుందుర్పి. : గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వం రేపటి నుండి ప్రారంభం కావడంతో కుందుర్పి మండలంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.మండల పరిధిలోని 13 గ్రామ పంచాయతీల్లో మొత్తం 44,470 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈనేపథ్యంలో అధికార కూటమిపార్టీలు,ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ దాని మిత్రపక్షం సీపీఐ మధ్య రాజకీయ పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. గ్రామాల్లో పట్టు సాధించేందుకు ఇరుపక్షాల నాయకులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారకార్యక్రమాల వరకు పోటాపోటీగా ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో ఎక్కడచూసినా ఎన్నికల చర్చలే కనిపిస్తున్నాయి.
**కూటమి అభ్యర్థుల్లో ధీమా..**
అధికార కూటమి తరఫున తెలుగుదేశం,జనసేన, బీజేపీ మద్దతుదారులు గ్రామాల్లో తమబలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రభుత్వ సంక్షేమపథకాలు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటున్నారు. గ్రామాల్లో తమకు అనుకూలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు.స్థానిక నాయకులు,కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.ప్రతి పంచాయతీలో గెలుపే లక్ష్యంగా కూటమి శ్రేణులు ఎన్నికలసమరానికి సిద్ధమవుతున్నాయి.
**వైఎస్సార్‌సీపీ,సీపీఐ వ్యూహాలు..**
మరోవైపు ప్రతిపక్ష వైసీపీ,మిత్రపక్ష సీపీఐ కూడా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ప్రభుత్వ విధానాలు,స్థానిక సమస్యలు,ప్రజలకు అందాల్సిన సౌకర్యాలను ప్రధానఅంశాలుగా ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో తమకు మద్దతుగా నిలిచిన ఓటర్లను తిరిగి తమవైపు తిప్పుకునేందుకు నాయకులు కృషి చేస్తున్నారు.ఏదిఏమైనా స్థనిక ఎన్నికలో కేవలం రెండుఎంపీటీసీలకే పరిమితమైన వైసీపీ, ఒక ఎంపీటీసీతో సర్దిపెట్టుకున్న సిపిఐలు సర్పంచ్ ఎన్నికల్లో 13 పంచాయితీ సర్పంచులు వైసీపీ కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుంది
**ఓటరు నాడి ఎవరివైపు?**
మండలంలోని 13గ్రామ పంచాయతీల్లో ఏపార్టీకి ప్రజలు పట్టంకడతారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఓటర్లునిలుస్తారా? లేక వైసీపీ,మిత్రపక్షలకి అవకాశం కల్పిస్తారా? అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు, గ్రామాల్లో వారికున్న ఆదరణ,స్థానికసమస్యలపై వారి స్పందన,సామాజిక సమీకరణాలు ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశంఉంది.పార్టీల గుర్తులకంటే గ్రామ అభివృద్ధికి కృషిచేసే, చదువుకున్న నాయకుడికే ప్రాధాన్యం ఇస్తామని పలువురు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా 44,470 మంది ఓటర్ల తీర్పు కుందుర్పి మండల రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనుంది ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకునే కొద్దీ రాజకీయపోరు ఇంకెంత రసవత్తరంగా మారుతుందో వేచి చూడాలి. *
టి.రాజు సూర్యరిపోర్టర్ కుందుర్పి*