చిన్నారుల ఆనందమే మా లక్ష్యం...
శ్రీకాకుళం నవంబర 14 మేజర్ న్యూస్ : చిన్నారుల ఆనందమే మా లక్ష్యం.. వారి భవిష్యత్తుకు ప్రోత్సాహమే మా బాధ్యతని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్ష బృందం పేర్కొంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు లయన్ నటుకుల మోహన్ బృందం, కెరీర్ ఫెయిర్ సాయిబాబా ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించిన బాలల వారోత్సవాల వేడుకలు ఘనంగా ముగిశాయి. స్థానిక ఒక ప్రైవేట్ హాల్ లో శనివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో వారం రోజులపాటు వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా లయన్ నటుకుల మోహన్ చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ.."పిల్లలూ.. మీరంతా ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని మీలోని ప్రతిభను చాటుకోవడం చాలా ఆనందంగా ఉందని, గెలుపొందిన వారు మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. బహుమతి రాని వారు నిరాశ చెందకుండా మరోసారి ప్రయత్నించాలని, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దానిని గుర్తించి అభివృద్ధి చేసుకోవాలన్నారు. జిల్లా పర్యావరణ విభాగం అధ్యక్షులు లయన్ పొన్నాడ.రవికుమార్ మాట్లాడుతూ.. చిన్నారులలో చిన్ననాటి నుంచే సృజనాత్మకత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి చిన్నారి తనలోని ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు ఆటలు, పాటలు, కళలు, సేవా కార్యక్రమాలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని, మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుని కష్టపడి చదవి, మీ తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని , మీరే రేపటి దేశ భవిష్యత్తని, మీ కలలు నిజం కావాలని, మీరంతా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.
ఈ ముగింపు వేడుకలో నగర ప్రముఖులు, వైద్యులు, న్యాయవాదులు, వక్తలు, స్వచ్ఛంద సేవకులు, చిన్నారులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.
బి. గోపాలకృష్ణ (శ్రీకాకుళం )