విద్యార్థులు గ్రంధాలయాలు సద్వినియోగం చేసుకోవాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం:పుస్తక పఠనం విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు మేధో సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుందని కొత్తపేట ఆర్డీఓ జి.వి.వి.సత్యనారాయణ అన్నారు.విద్యార్థులు పుస్తక పఠనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.కొత్తపేట ద్వితీయ శ్రేణి శాఖా గ్రంథాలయంలో గ్రంథపాలకురాలు కుంచే సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను శనివారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా సరస్వతీ దేవి,జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.విశ్రాంత గ్రంథపాలకుడు చామకూర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ చదువు శక్తివంతమైన ఆయుధమని,గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలని అన్నారు.గతంలో ఎంతోమంది గ్రంథాలయాల ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు.నేటి యువత గ్రంథాలయాల ప్రాముఖ్యతను గుర్తించాలని,కత్తి కంటే కలం గొప్పదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు.ప్రతిరోజూ దినపత్రికలు చదవడం ద్వారా సమాజంలో జరుగుతున్న పరిణామాలు,ప్రపంచ విషయాలపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎంఈఓ ఏడిద సత్తిరాజు,ప్రియదర్శిని బాలవిహార్ కరస్పాండెంట్ ఏబీసీ దేవ్,సామాజికవేత్త కాండ్రేగుల గంగరాజు,డిప్యూటీ తహసీల్దార్ పి.పద్మ,ఆర్ఐ రవిశంకర్,శివానందం,కీర్తిమూర్తి,పాఠకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.